పిల్లల చేతికి ఫోన్ ఇవ్వద్దు
పది నెలలు నిండని పసిపిల్లలు కూడా చేతికి మొబైల్ ఫోన్ ఇస్తే తప్ప అన్నం తిననని మారం చేసే రోజులు ఇవి. ఈ డిజిటల్ యుగంలో పిల్లలు ఈ స్క్రీన్ కి ఎంతగా అలవాటు పడుతున్నారంటే ఆ ఫోన్ లేకుండా నిమిషం ఊరుకోరు. అయితే పుట్టిన ఆరో నెల నుంచి వాళ్ళు సరిగ్గా మెడ నిలిపాక, స్క్రీన్ చూస్తూ ఉంటే అది వాళ్ళ జ్ఞాపకశక్తిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అని అంటుంది వరల్డ్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ తాజా అధ్యయనం. పిల్లల్లో ఈ మొదటి సంవత్సరం అత్యంత కీలకమైంది ఈ దశలో ముఖాముఖి సంభాషణలు, శారీరక కదలికలు ఆటల ద్వారా, మెదడు వేగంగా నేర్చుకుంటూ పెరుగుతుంది. అలా నేర్చుకునే దశలో ఎక్కువ సమయం స్క్రీన్ చూడటం వల్ల తర్వాత కాలంలో పిల్లలు స్కూల్లో ఇచ్చిన సూచనలు పాటించడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కావలసిన జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది.వారిలో ఊహాశక్తి సృజనాత్మకత గణనీయంగా తగ్గుతుంది కళ్ళతో నిరంతరం కదిలే స్క్రీన్ చూడటం వల్ల మెదడుకు ఆలోచన తగ్గి ఒక స్తబ్దత ఏర్పడుతుంది వాళ్లు నేర్చుకోవటంలో కచ్చితంగా వెనకబడతారు అంటుంది జర్నల్ అధ్యయనం. పిల్లలకు స్క్రీన్ చూసేందుకు మనం ఎంత సమయం ఇస్తున్నాము ఏ వయసులో ఇస్తున్నాము అని మాత్రం పెద్ద వాళ్ళు గ్రహించుకోవడం మంచిది అంటున్నది ఈ అధ్యయనం .తప్పకుండా చిన్న పిల్లలను మొబైల్ ఫోన్ కి ,స్క్రీన్ కి సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. అప్పుడే వారిలో నేర్చుకునే శక్తి పెరుగుతుంది.వారితో మాట్లాడటం ఆటలాడటం ద్వారా మాత్రమే వాళ్ళు ఎక్కువ నేర్చుకో గలుగుతారు.
