ఉద్యోగం కవిత ధ్యేయం
రామ్గఢ్ జిల్లాలో మొత్తం 284 హోంగార్డు పోస్టుల భర్తీ కి నియామక ప్రక్రియ చేపట్టింది అక్కడి ప్రభుత్వం.మొత్తం పోస్టుల్లో 50 శాతం మహిళలకే రిజర్వేషన్. వితంతువులు విడాకులు పొందిన మహిళలకు అదనంగా ఐదు శాతం రిజర్వేషన్ కల్పించారు.ఈ పోటీలో 1600 మీటర్ల పరుగును ఆరు నిమిషాల్లోనే పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యం లో ముంచింది ధైర్యశాలి కవిత మహతో. ఎర్రని ఎండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఈ హోంగార్డు కొలువు సాధించి పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని తపనతో ఇంత పరుగు తీసింది కవిత.ఈమె పరుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో డుమ్రీ ఎమ్మెల్యే జైరామ్ కుమార్ మహతో ఆమెతో మాట్లాడి ఆమె పోరాటాన్ని అభినందించారు. ట్రాక్స్ సూట్ షూస్ పంపించారు .ఆమెకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు .డిఫెన్స్ అకాడమీ ఆమెను ఘనంగా సన్మానించి అభినందించింది. వలస కార్మికుడైన ఈమె భర్త దీపక్ మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు.తరువాత కొద్ది రోజులకే మరిది కూడా చనిపోయాడు. వృద్ధాప్యంలో తన మీదే ఆధారపడి జీవిస్తున్న అత్తమామలు, తన ఇద్దరు పిల్లలు భవిష్యత్తు కోసం ఈ కష్టమంతా భరించింది కవితా మహతో.
