ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం
కేరళలోని మొట్టమొదటి గిరిజన ఐఏఎస్ అధికారిగా కలెక్టర్ గా రికార్డ్ సృష్టించారు శ్రీధన్యా సురేష్. 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఆమె ప్రయాణం ప్రారంభమైంది కోజికోడ్ అసిస్టెంట్ కలెక్టర్ గా, పెరింతల్ మన్న సబ్ కలెక్టర్ గా, తర్వాత కేరళ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా బాధ్యతలు నిర్వహించారు. కాసర్ గోడ్ జిల్లా కలెక్టర్ గా కూడా పనిచేశారు. కేరళలోని వైనాడు జిల్లా సుల్తాన్ బతేరి సమీపంలో ఉన్న ఇడుక్కల్ అనే చిన్న గిరిజన గూడెంలో కురిచియా అనే గిరిజన తెగలో జన్మించింది శ్రీ ధన్య. గిరిజన పాఠశాలలో రోజు నాలుగు కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లి చదువుకుంది. కోసికోడ్ లోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో జువాలజీ లో డిగ్రీ పూర్తి చేసింది. కాలీ కట్ విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది తరువాత కేరళ గిరిజన సంక్షేమ శాఖలో షెడ్యూల్డ్ ట్రైబ్ ప్రమోటరుగా ఒక ఉద్యోగం చేసింది. ఆ తరువాత ఐఏఎస్ వైపు అడుగులు వేసిందామె. రెండేళ్ల పాటు సివిల్స్ రాయటం కోసం కష్టపడి చదివింది. ఆమె కష్టం ఫలించి ఒక జిల్లాను శాసించే స్థాయికి ఎదిగింది .జిల్లా కలెక్టర్ గా రికార్డ్ సృష్టించింది.దశాబ్దాల తరబడి కన్నీళ్లు, ఆకలి కేకలు, కటిక పేదరికం, సామాజిక అవమానాలు వీటన్నిటిని దాటుకొని వచ్చిన అపరిమితమైన ఆత్మవిశ్వాసం ఆమెది. తరతరాలుగా అవకాశాలకు దూరమైన ఒక సమాజపు ఆశా కిరణం శ్రీధన్య సురేష్.
