నృత్యానికి వారసురాలు
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు రాధా రెడ్డి రాజారెడ్డి దంపతుల కుమార్తె భావనా రెడ్డి. ఐదేళ్లకే ఆమె నృత్యం నేర్చుకుని దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది.1997లో రాజా,రాధా రెడ్డి, బృందంలో సభ్యురాలుగా అమెరికా పర్యటన చేసి ప్రహ్లాద చరిత్ర లో చిన్ననాటి ప్రహ్లాద పాత్ర పోషించడం లో భావనా రెడ్డి ప్రయాణం మొదలైంది. సోలోగా అజంతా ఎల్లోరా ఫెస్టివల్ లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది .ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఆధ్వర్యంలో విదేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తుంటుంది భావన. సంగీత నాటక అకాడమీ నుంచి బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకుంది భావన. అలాగే కూచిపూడి నృత్యానికి సేవలు అందించినందుకు గాను తెలుగు కల్చరల్ అసోసియేషన్ టెక్సాస్ నుంచి జీవిత సాఫల్య పురస్కారం,అలాగే ఫిక్కీ యంగ్ ఉమెన్ అచీవర్స్ అవార్డు కూడా భావనా రెడ్డిని వరించింది. ఢిల్లీ లోని నాట్య తరంగిణి సంస్థ కు బోర్డు డైరెక్టర్ గా ఉన్నది భావన. ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాలు, నృత్య ఉత్సవాల్లో కూచిపూడి ప్రదర్శనలు ఇస్తుంది భావన. అలాగే ఆన్లైన్లో కూచిపూడి క్లాసులు చెప్పేందుకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్ ని ప్రారంభించింది. అమెరికా ఐరోపా ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉన్న వాళ్ళతో పాటు భారత్ నుంచి కూడా ఎంతోమంది ఆన్లైన్లో నృత్యం నేర్చుకుంటున్నారు. ఏడాది పాటు వీళ్ళకు ఈ శిక్షణ ఉంటుంది. సంప్రదాయ నృత్యం పవిత్రత తో ముడిపడిన భావన పాదాల కదలిక అభినయం ముద్ర వీటి మధ్య చక్కని సమన్వయం తో ప్రదర్శన ఇవ్వగలిగితేనే వాళ్లు అసలైన కళాకారులు అంటుంది భావన. డాన్స్ ఏకాగ్రతను పెంచి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.ఇందులో కూచిపూడి ఇంకా ప్రత్యేకం అంటుంది భావనా రెడ్డి.
