చూపు లేని విద్యార్థులకు ఒక వరం
చూపులేని విద్యార్థుల కోసం వాయిస్ కమాండ్ ఆధారంగా పనిచేసే బ్రెయిలీ ప్రింటర్ తయారు చేసి జేమ్స్ డైసన్ అవార్డు తీసుకుంది లింగంపల్లి హిమజ. ఏలూరు జిల్లా చింతలపూడి కి చెందిన లింగంపల్లి హిమజ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విష్ణు మహిళా యూనివర్సిటీ లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ప్రతి సంవత్సరం వివిధ దేశాల నుంచి ఇంజనీరింగ్ విద్యార్థుల ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు జేమ్స్ డైసన్ ఫౌండేషన్ ఒక అవార్డు ప్రదానం చేస్తుంది .ఈ అవార్డు కోసం లింగంపల్లి హిమజ ఆరు బటన్లు సహాయంతో పనిచేసి బ్రెయిలీ లిపి ప్రింటర్ తయారు చేసింది.అది వాయిస్ ను టెక్స్ట్ గా టెక్స్ట్ ను బ్రెయిలీ లిపి రివర్స్ పాటర్న్ గా మారుస్తుంది. దీన్ని అలెక్సా కి కలపగానే అలెక్స వాయిస్ ఇవ్వడంతోనే టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసి ఈ ప్రింటర్ ప్రాసెసర్ కు పంపిస్తుంది. అలెక్స మాట్లాడిన ప్రతి మాటను స్వీకరించి దాన్ని తిరిగి వినిపించి నిర్ధారణ చేస్తుంది. ఇప్పటివరకు చూపు లేని విద్యార్థులు బ్రెయిలీ ఆధారిత ఇన్పుట్ పద్ధతులపైనే ఆధారపడుతున్నారు.ఈ విధానాల్లో బ్రెయిలీ అక్షరాలను సూది లాంటి పరికరం తో గుచ్చి వాటిని పేపర్ తిప్పి చదవాలి. ఈ పిన్నును పలుసార్లు గుచ్చటంలో వేలి కి గాయమవుతుంది. హిమజ తయారు చేసిన పరికరం విద్యార్థులకు ఆ ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఈ ఆవిష్కరణ హిమజ ను దేశంలో ప్రథమ స్థానంలో నిలిపి జేమ్స్ డైసన్ అవార్డును తీసుకొచ్చింది.
