Wednesday, 30 Sep, 2026

గ్రాండ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ

భారతదేశంలో తొలి మహిళా హృద్రోగ నిపుణురాలిగా చరిత్ర సృష్టించారు శివరామకృష్ణ అయ్యర్ పద్మావతి .భారతదేశంలో మొట్టమొదటి కార్డియాలజీ క్లినిక్, కార్డియాక్ కేథటరైజేషన్ ల్యాబ్ వ్యవస్థాపకురాలు కూడా. 1952లో  హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చదువుకున్నారు పద్మావతి. యూకే లో నేషనల్ హార్ట్ హాస్పిటల్ లో పనిచేశారు 1953లో భారతదేశానికి తిరిగి వచ్చి ఢిల్లీ లోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో లెక్చరర్ గా చేరారు.తర్వాత దేశం లోని తొలి కార్డియాలజీ క్లినిక్ ప్రారంభించారు ఎంతోమంది యువ వైద్యులకు ఆమె స్ఫూర్తి .నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు గాను 1962లో ఒక  వైద్యుల బృందం, పారిశ్రామికవేత్త అశోక్  జైన్ తో కలిసి ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ స్థాపించారు. దేశం గర్వించే వైద్యురాలిగా పద్మావతి పేరు తెచ్చుకున్నారు. అలాగే జీవితాన్ని నిరుపేదలకు అంకితం చేశారు. సోదరి న్యూరాలజిస్ట్ జానకి తో కలిసి జానకి పద్మావతి ట్రస్ట్  స్థాపించారు. దీని  ద్వారా తమ సంపాదనను పేద రోగుల గుండె చికిత్సల కోసం విరాళంగా ఇచ్చారు .95 ఏళ్ల వయసు వచ్చేవరకు చురుకుగా పని చేశారు. 103  ఏళ్ల వయసులో కన్నుమూశారు పద్మావతి. ఆమె మరణం భారతీయ కార్డియాలజీ రంగంలో ఒక అద్భుతమైన శకానికి ముగింపు పలికింది. కానీ ఆమె వారసత్వం మాత్రం దేశ విదేశాల్లో ఎంతోమంది మంచి వైద్యులకు స్ఫూర్తి ఇచ్చింది. గుండె ఆరోగ్యానికి సంబంధించిన నిర్మాణాత్మకమైన విధానాలకు దారివేసి గ్రాండ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ గా పేరు తెచ్చుకున్నారు పద్మావతి. ఎన్నో దశాబ్దాల  వృత్తి జీవితంలో హృద్రోగ రంగంలో గణనీయమైన కృషి చేశారామె.

Leave a Reply