నిహారికా,
తల్లిదండ్రులు పిల్లల్ని అరవడం మామూలే, ఏదో ఒక సందర్భంలో వాళ్ళు పనులు నచ్చక, వాళ్ళ అల్లరి భరించలేక కోప్పడతారు, అరుస్తారు. ఆలోచిస్తే ఇది సహజ ధోరణే కానీ పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ , టీనేజ్ లోకి అడుగుపెట్టాక ఈ అరుపుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. యుక్త వయసులోకి వస్తున్న సమయంలో కఠిన పదజాలం వాడుతూ తల్లిదండ్రులు దండిచడం, క్రమశిక్షణ నేర్పే ప్రయత్నాలు చేయడం మనసుకి కష్టం కలిగిస్తాయి. యువతలో ప్రవర్తనా సంబంధిత సమస్యల్ని పరిష్కరించుకోవడంలో ఈ పదజాలం ఉపకరించకపోగా నిజానికి ఇటువంటి ప్రవర్తనను ఇంకా పెంచుతుంది. టీనేజ్ లో ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఓర్పు పాటించాలి. సహనం, సంయమనం పాటించాలి. వారిపై పెద్దగా అరిచి, విసుక్కుని తమ కోపం తీర్చేసుకుంటే, పిల్లల్ని అదుపులో పెట్టామని సంతృప్తి పడితే సరిపోదు. ఈ కేకలు, అరుపులతో సమస్య ఇంకాస్త పెరిగిందనీ, తర్వాత దాని ప్రభావం ఉంటుందని పెద్దవాళ్ళు మరచిపోకూడదు. పిల్లలు అప్పటికే తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునేంతవరకు ఎదిగారనీ, ఈ కేకలు, అరుపుల్ని వాళ్ళు అవమానంగా భావిస్తారని తెలుసుకోవాలి. ఎదిగిన పిల్లలు కేవలం స్నేహితుల్లాంటివారే.













