మొదటి సారి కడుపులో మంటగా అనిపించింది ఇవ్వాళ . ఎందుకై ఉంటుందని ఆలోచిస్తే..ఇవాళ మధ్యాహ్నం ఒక ఛాయ్ తాగాను అని గుర్తుకు వచ్చింది. ఐతే అది పాలతో చేసిన ఛాయ్ కాదని తాగేటప్పుడు అనిపించింది. సింథెటిక్ పాలతో చేసి ఉండింటారు. సింథెటిక్ పాలు అంటే గ్లూకోజ్, రిఫైన్డ్ ఆయిల్, కాస్టిక్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, వైట్ పెయింట్, డిటర్జెంట్ వంటివి కలిపి పాలను కల్తీ చేసే కొత్త విధానం. యూరియా, స్టార్చ్, ఫార్మాలిన్ వంటివి పాలను ఎక్కువ కాలం పగిలిపోకుండా నిలువ ఉంచుతాయి కాబట్టి వాటిని కూడా కలుపుతున్నారు.

మన దేశంలో రోజుకు 15 కోట్ల లీటర్ల పాలు అవసరం ఔతాయి. సగటున అర్ధ లీటరు పాలను లాగించేస్తాం మనం. అంటే 130 కోట్ల మందిలో 30 కోట్ల మందిమి పాలను, పాల ప్రొడక్ట్స్ ( మన లెవిల్ కి టీ ఎక్కువ అనుకోండి!) తాగే పాపాయిలం అన్నమాట. అందువల్ల అన్ని లీటర్ల పాలను మనం ఉత్పత్తి చేయలేక ఇటువంటి విషపూరితమైన కల్తీ పాలను అసలైన పాలల్లో కలిపి అమ్మటం చేస్తున్నారు. అమ్మే పాలలో దాదాపు 68 శాతం పాలు ఉండవలసిన స్టాండర్డ్స్ లో లేవంట (FSSAI). ఈ కల్తీ పాలవలన మనలోని అవయవాలు కోలుకోలేని విధంగా డ్యామేజ్ అవుతున్నాయట…

ఇంకో భయంకరమైన వార్త ఏమంటే WHO భారత ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చిందట. పాల కల్తీని కనుక వెంటనే అరికట్టక పోతే..2025 కల్లా 87 శాతం మంది పౌరులు క్యాన్సర్ బారిన పడతారని చెప్పిందంట. అంటే వాళ్ళ రీసెర్చి లో అత్యంత దొంగనాయాళ్ళు ఉండే దేశం మనదే అని అర్థమయింది కదా!. కాబట్టి మనం చేసుకునే తొక్కలో మీటింగ్ లకు కాఫీలు, టీలు ఆఫర్ చేయటం మానేద్దాం.

–-డాక్టర్.విరివింటి.విరించి(కార్డియాలజిస్ట్)

Leave a comment