జానపద గేయాలు- తెల్లవారింది

 

-డి. సుజాతా దేవి
తెల తెల్లవారిందిలె
తూరుపు ఎరుపెక్కింది లె

మంచి బావి నిదర
పెదిరి బెదిరి చూసింది
సెరరువునీటతమ్మిమొగ్గ
జరిగి ఒరిగి తూలింది!!

పాలదార జుం జుమ్మని
పల్లెని మురిపించింది
గంటల గణగణ పాటకు
డొంక నిదరలేసింది!!

ఉగ్గుబెట్టి తొలి తల్లి
సిగ్గుజోల పాడింది
ఉయ్యాలకు మాటలొచ్చి
ఊసులెన్నో చెప్పింది!!

తెల్ల మబ్బు పిల్లొకటి
ఎర్రసీరి కట్టింది
ఎవరికోసమో పరుగున
ఎతుకులాడతా వుంది!!

మబ్బుల పొత్తిళ్ళలోన
పురిటికందు కదిలాడు
మూసిన గుప్పిళ్ళు విప్పి
ముని వెలుగులు చిలికాడు!!