ఎలిజెబెత్ ఏకాదశి

కొన్ని సినిమాలు వెంటాడుతాయ్. ఉత్తమ బాలల చిత్రంగా (2014) అవార్డు పొందిన ఈ మరాఠీ సినిమా, ‘ఎలిజెబెత్ ఏకాదశి’ నిజానికి ఇద్దరి ఒంటరి తల్లుల జీవన పోరాటం. ఒక తల్లి, చనిపోయిన భర్తను తలుచుకొనే వ్యవధి కూడా లేకుండా, ఇద్దరు పిల్లలూ అత్తతో నిత్యం కష్టపడుతూ ఉంటుంది. ఇంకో తల్లి (ఈమె పాత్రను తక్కువగా చూపించారు. కానీ మనసులో మిగిలిపోతుంది) సెక్స్ వర్కర్ గా పని చేస్తూ పిల్లాడిని చదివిస్తూ ఉంటుంది.తల్లి వృత్తి కారకంగా ఆ పిల్లాడు స్కూల్ లో ఎదుర్కొనే అవమానం రేఖ మాత్రంగా (గుండే ద్రవించేలా) చూపించారు. కథంతా మహారాష్ట్రలోని దేవాలయ పట్నం పంథర్ పూర్ లో నడుస్తుంది. అక్కడ నడిచే భక్తి కంటే జరిగే వ్యాపారాలు, వాటి వెనుక నడిచే జీవితాల మీద ఫోకస్ ఉంటుంది.

ఇంతకీ ఈ సినిమాలో ఎలిజెబెత్ అంటే ఒక సైకిల్ పేరు. ఎలిజెబెత్ అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు పిల్లాడు ‘నశించనిది’, అని సమాధానం చెబుతాడు. సైంటిష్టు అయిన తండ్రి మరణానికి ముందు ఆ సైకిల్ తో బాటు కొన్ని భౌతిక వాద భావాలను తన పిల్లాడికి బహుకరించి వెళతాడు. ఆ భావాలతో బాటుగా, ఆ సైకిల్ ను కూడా పిల్లాడు ఎప్పడూ వదలకుండా మోస్తుంటాడు. న్యూటన్ సూత్రాలను వల్లె వేస్తూ ఉంటాడు.
కుటుంబ పరిస్థితుల వలన ఆ సైకిల్ అమ్మాల్సి రావటం, ఆ పసి హృదయాలు తట్టుకోలేక పోతాయి. దాన్ని ఆపే ప్రయత్నం వెనుకనే కథంతా నడుస్తుంది.చివరకు ఎలిజెబెత్ నిలుస్తుంది. న్యూటన్ గెలుస్తాడు.
ఈ కథలో ఒక్క నెగెటివ్ పాత్రా ఉండదు. ఒక అవాస్తవ చిత్రీకరణ కనబడదు.2010లో మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన యాంటీ సూపర్ స్టీషన్ చట్టం కూడా కథలో ఒక పాత్రగా కనిపిస్తుంది. నందితా ధూరి ఒంటరి తల్లిగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె పిల్లాడి కోసం పంథర్ పూర్ వీధుల్లో వెతుకలాడుతూ తిరగే దృశ్యం హృదయానికి గుది గుచ్చినట్లుగా ఉంది ఇప్పటికీ. పిల్లల్లో చెల్లి పాత్రలో వేసిన ‘సయాలి’ అందరి పిల్లల కంటే ప్రొఫెషనల్ గా చేసింది. గాజులు అమ్మే దగ్గర ఆ పిల్ల నటన తప్పక చూడాలి.
డైరెక్టర్ పరేశ్ మొఖాసి గతంలో ‘హరిచంద్ర ఫాక్టరీ’ (దాదా సాహెబ్ ఫాల్కే జీవిత కథ) సినిమా తీశాడు.
మనం చూడని లోకాలు, మనం ఎరుగని భావోద్వేగాలు, మనం బతకని బతుకుల సినిమాల మధ్య ఈ సినిమా హాయిగా ఉంది. ఎవరు అన్నారు? భారతదేశంలో మంచి సినిమాలు రావటం లేదని. మనం చూడటం లేదు అంతే.
మూవీ లింక్: https://www.zee5.com/movies/details/elizabeth-ekadashi/0-0-19
రచన: రమా సుందరి